రామప్ప ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు అందించాలి: బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి..
వెంకటాపూర్ (ప్రజానాడి న్యూస్) : రామప్ప చెరువు ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి డిమాండ్ చేశారు.
ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రామప్ప చెరువు కింద అధికారికంగా 5 వేల ఎకరాలు, అనధికారికంగా మరో 5 వేల ఎకరాల భూములు సాగవుతున్నాయని అన్నారు. రామప్ప చెరువు నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే కుట్రలో భాగంగానే నేడు రామప్ప ఆయకట్టు రైతులకు నీరు అందించడం లేదని పేర్కొన్నారు.
తలాపునే సముద్రం లాంటి రామప్ప చెరువును పెట్టుకొని స్థానిక రైతులు సాగునీటికి తల్లాడడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు నీటిమట్టం ప్రకారం ఆయకట్టు రైతులకు సరిపడా సాగునీరు అందుతుందని తెలిపారు. అయినప్పటికీ అధికారులు రామప్ప చెరువు నీటిని నిలిపివేయడం సరికాదని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన పోరాటం చేస్తూ వారికి అండగా ఉంటుందని స్థానిక రైతులకు హామీ ఇచ్చారు. ఇటీవల తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలోనే అధికారులు మూడు రోజులపాటు సాగునీటిని విడుదల చేశారని అన్నారు.
ప్రస్తుతం రామప్ప చెరువు ఆయకట్టు కింద రైతులు నాట్లు వేస్తున్నారని, ఈ క్రమంలో మళ్లీ నీటిని నిలిపివేయడం పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రామప్ప చెరువు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
అందులో భాగంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రామప్ప ఆయకట్టు రైతులు కలిసి రావాలని రమణారెడ్డి పిలుపునిచ్చారు..